Tuesday, September 13, 2022

బ్రతుకు


మనిషి అంతర్గతంగా ఎంత గాయపడితే

బహిర్గతంగా అంత మౌనం వహిస్తాడు..


మంచితనంగా ఉండి మోసపోయిన వాడే

అంతకు మించి చెడ్డవాడిగా మారతాడు..


సమయానుసారం సాగాలని కానీ లేదంటే

చెప్పేవన్నీ నోరుమూసుకుని విన్నవాడు

అంతకు మించి మాటలు వినిపించగలడు

చావడానికి కొంచెమే కష్టపడి బ్రతకడానికి

మరెంతో కృషి చేస్తూ చచ్చి బ్రతుకుతాడు!

Sunday, November 7, 2021

వెతికి విసిగి


వేరొక ఇంటి కప్పుపైన నా చందమామ 

ప్రకాశిస్తుంటే నా హృఅదయ తల్లడిల్లింది 

కన్నీటిలో నేను పూర్తిగా మునిగిపోతిని

ఒడ్డున ఉండి ఆనందిస్తున్నారు వేరెవ్వరో

మళ్ళి ప్రేమలో మునగాలంటేనే భయ్యం

కనికరించే ప్రేమ దొరకడం బహుకష్టం.. 

కంట్లో వత్తులు వేసుకుని మరీ వెతికాను 

నువ్వు తప్ప ఎక్కడా ఎవ్వరూ కానరారు

వెతికితే భగవంతుడైనా కనబడతాడంటారు

నాకు మాత్రం నీప్రేమ ఎక్కడా దొరకలేదు..


Tuesday, December 3, 2019

ఉతికిన బట్టలు

నా దుస్తులలో నీ ఆనందకరమైన పరిమళగుబాళింపులు

ఇంట్లోకి అడుగిడి పరిమళాలు పోవాలని పిండి ఆరేస్తాను

నా చేతుల్తో నేనే స్వయంగా ఇస్త్రీ చేసి మరీ మడుస్తాను

అయినా సరే ఎందుకనో పోవుగా ముడతలూ పరిమళాలు

పిండకుండా ఆరేస్తే ముడతలూ రావు పరిమళాలూ పోవు 

అలాగని ఉతక్కుండా వేసుకున్న బట్టలు ధరించనూ లేను

చెమటపట్టి మాసిన బట్టల్లో పరిమళాలు పొందు పరచలేను!  


Tuesday, February 5, 2019

జీవితం..

అంతా నా సొంతం అనుకున్న ఆరాటంలో
నాకే అన్నీ కావాలన్న అవివేకంతో 
అన్నింటినీ తీర్చుకోవాలన్న ఆర్భాటం..

సాధించి అనుభవిస్తున్న ఆనందంలో 
పట్టించుకోక చేస్తున్న ఎన్నో తప్పులతో 
అధ్యాయాలన్నీ చేస్తున్నారు భూస్థాపితం..

ఒకటి తరువాత మరొక కోరికల పరువంలో 
పనికిరాని సాంఘత్యాల సహవాసంతో 
ఎన్నో ప్రశ్నల వలన అవుతాం నాశనం..

Friday, July 6, 2018

నేను



నిన్న కోసం మొన్న నేటి కోసం నిన్న 
రేపటి కోసం నేడు బాధ పడుతూ 
ఆవేశ పడుతూ అసహాయతతో ఆందోళనతో 
బ్రతుకుతున్న జీవిని నేను...
జీవితాన్ని జీవించలేక వర్తమానంతో పోరాడలేక
బ్రతుకుని నడిపిస్తున్న బానిసను నేను
హృదయమే అడవిగా మనసే ఎడారిలా 
రెంటికీ చెడ్డ రేవడిలా భవిష్యత్తు భయంతో
బ్రతుకుతున్న జీవిని నేను...
కళ్ళుండీ కనపడనీ చెవులుండీ వినబడనీ
హృదయముండీ స్పందించని 
ఈ జీవారణ్యంలో కలుపుమొక్కని నేను
అడుగు ముందుకెయ్యలేని అభాగ్య జీవిని నేను
జీవమున్న మాంసం ముద్దలా మిగిలి 
మనసంతా నిర్జీవమై సగం కాలిన శవాన్ని నేను

Sunday, December 10, 2017

నిదురపో

సందెపొద్దు వాలి సందడంతా సోలిందీ 
అందరాని అంబరాన్న చందమామ తేలిందీ
జ్ఞాపకాలకు జోలపాడుతాను అనంటే వద్దంది  
నిదురపో అంటూ అలసిన శరీరం అంటుంది 
భాషరాని బాధలు గోలచేస్తూ నిదుర రానంది  
ఎంత అలసిపోయేయో నా ఆలోచనలు 
అలుపుతీరేలా కనుల నిదురపోదాం రమ్మంది 
కమ్మనికల కంటూ నిదురపొమ్మని జాబిలి అంది 

Wednesday, November 15, 2017

నీతో నేను

నీ అరవిరిసిన మోమును చూసా
అధరాలు కనులతో పాటు చెప్పిన 
అందమైన ఊసులు ఎన్నో విన్నా 
గంధర్వుడిని కాను నిన్ను స్తుతించ  
కవికోవిదుడను కాను నిన్ను వర్ణించ 
తత్వవేత్తను కాను నీతో తర్కించ 
ముసుగులో భావాలను దాచుకోలేను 
కోర్కెల్ని ఎదలో బంధించి మోయలేను   
మంత్రం వేసినట్లు నీ వైయనం తిలకిస్తాను 
ఏమైనా జరగనీ అంటూ ఊహల్లో విహరిస్తాను!

Wednesday, September 27, 2017

సంకేతం

నలుపు తప్ప తెలియని నాకు
రంగు రంగుల కలలను అందించి 
నిదుర మరచిన కనురెప్పలకి
వేదనల బరువును జతచేసి
దిక్కుతోచక పైకి ఎగురలేక
రెక్కలు తృంచి వ్యధను పెంచి  
వసంతం నాసొంతం కాదని చెప్పి  
జీవితాన్ని సమాప్తం చేసుకోమని
పరోక్ష సంకేతాలు అందించిన
నా ప్రతీ అనుభవానికి సలాం!!!  

Saturday, September 2, 2017

ఇసుక పువ్వు

నేను ఒక ఇసుక పువ్వును 
అందినట్లే అంది చేజారిపోతాను
నాకు ఏ బాదరా బంధీలు లేవు
ఆకుల వంటి అనుబంధాలు లేవు
నిలకడ లేని అనిశ్చల రూపం  
గాలికి ఎగిరే ఎడారి జీవితం  
నిర్వికారంతో ఏ పరిమళం లేక 
విచ్చుకున్న ఇసుక పువ్వును.. 

Wednesday, June 29, 2016

ఒంటరి బాటసారి


                        రాతిరనక పగలనక విసిగి వేసారిపోక
ఒంటరినై ఆలోచనలతో సతమతమౌతూ
శాంతిసౌధ కుటీరాన్ని నిర్మించే ప్రయత్నంలో
పొడిబారిన కళ్ళలో కన్నీరు రాక పొగబారి
పగటి వెలుతురులో ఖాళీ కుండలు చూసి
రాత్రి చీకటిలో అగాధాన్ని చూసి జడిసి..
జీవించడానికి కారణం ఏం కనబడక
మరణించే మార్గంలేక బ్రతకడానికి వంక వెతుకుతూ
వయస్సుని మించిన నిడివి రోడ్డులో గమ్యం రాక
పరుగులు పెడుతూ ఆగక అపరిచితుల నడుమ
తెలిసిన వారికోసం వెతుకుతూ తిరుగుతూ..                         

Sunday, March 27, 2016

జ్ఞాపకాలు..


మన ప్రేమకి ముగింపు విచిత్రంగా ఉంది

నీ వాడిని ఎలాగో కాలేకపోయాను సరే

కనీసం ఇంకెవరికీ దక్కకుండా మిగిలాను 

మెడలో చేతికి ఎన్ని తాయెత్తులు కట్టుకున్నా 

లాభం లేకుండాపోయింది..

నీ జ్ఞాపకాలని అవి ఏమార్చలేక పోతున్నాయి

సంధ్యావేళ ఇంట్లో దీపాలన్నీ ఆర్పివేస్తాను... 

నీ జ్ఞాపకాలతో హృదయం మండుతున్నది చాలు!

Saturday, August 8, 2015

ప్రాణం తీసుకో!

ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె

తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని

మనసులో నుండి తీసి మరచిపొమ్మని

ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది

కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని 

సంతోషంగా ఆమెను మరచిపోతానని...

ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని!!

Saturday, February 7, 2015

కావు


అబద్ధపు అభినందనల ఆసరాతో
కలల ప్రపంచంలో జీవించగలవు!!

నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో
అలల పై రహదారిని వేయలేవు!!

వ్యధనే వ్యక్తిగతమని ప్రియముతో
కన్నీటి దీపమెట్టి కాంతినీయలేవు!!

మనసు దహిస్తుంటే ఆలోచనలతో
నిస్తేజమైన శ్వాసతో ఈలవేయలేవు!!

అణగారిన అనామక కోర్కెల రెక్కలతో
ఆశయాల దుమ్ము దులిపి ఎగురలేవు!!

Friday, December 12, 2014

ఆగమ్యం

నిజాల నిలువుటద్దం నల్లబడిపోయింది

బుద్ధిహీనుల బుట్టంతా పూలతో నిండింది

అబధ్ధం నగ్నంగా బజారులో అమ్ముడైంది

నిజం చెప్పాలంటే నా తనువు వణుకుతుంది

సంసారాన్ని ఈదడంలో రెక్కలు ముక్కలైంది

రెక్కలు వచ్చిన పక్షి కొత్త గూడు వెతుక్కుంది

గమ్యం చేరలేని పయనం ఏడవలేక నవ్వింది!

Thursday, October 16, 2014

లోకంలో

 ధ్వేషించే లోకంలో
శాంతి కుటీరమే కట్టబోయా...
జనం వెర్రివాడినని రాళ్ళు రువ్వారు!!
పరుగు పందెం వంటి జీవితపయనంలో
గెలిస్తే జనం మన వెనుకనే వస్తారు...
ఓడిపోతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు!!

అనాధ లోకంలో అలసిపోయాను
నన్ను నేను రుజువు చేసుకోవాలంటూ
పద్ధతులు గతితప్పాయి కాని ఉద్ధేశాలు కావు
విజేత సంతోషంగా ఉన్నా లేకపోయినా...
సంతోషంగా ఉన్నవాడు తప్పక విజేత అవుతాడు!!

Monday, September 8, 2014

మాయపొర

మాటలురానప్పుడు అమ్మ మాట్లడకపోయినా

అన్నీ తనే అర్థం చేసుకుని సమకూర్చేది...

ఇప్పుడు మాటలొచ్చిన మనం అమ్మ ఏమన్నా

ఊరుకో నీకేం అర్థంకాదని అంటున్నాం....

ఇది అమ్మ మాటలు నేర్పినందుకు పారితోషకమా!

లేక కంటికి కమ్మిన జ్ఞానపొర మాయాజాలమా?

మాయేనేమో....అందుకే అమ్మ ప్రేమలో జీవముంది
 

Thursday, July 31, 2014

ప్రశాంతం

ఆటుపోట్లకి జంకని జీవితాన్ని కావాలని కోరితే
ఆలోచనల అఘాధంలోకి తొంగి చూడబోకన్నది

సూర్యకిరణాల నుండి ఒక తంతిలాగి చుట్టబోతే
సంధ్యా సమయం దాటి కారుచీకటే కమ్మేసింది

గడచిన కాలం స్మృతుల్లో మాధుర్యం వెతగబోతే
అలజడి అలే మోముపై ముడతై అగుపించింది

పైపైన సాగరం ప్రశాంతంగా ఉందని సంబరపడితే
లోపలదాగిన తూఫాను అలై ఎగసి ముంచేసింది

ముందున్న సంబరమే మురిపించి నవ్వించబోతే
ముందరి కాళ్ళకడ్డై విధివక్రించి విరగబడి నవ్వింది

Tuesday, June 17, 2014

ఒక సంచారి

నేనెప్పుడూ ఓటమిని కౌగిలించుకున్న ఒంటరిని

కలల ఎరల వలల ఉచ్చులో చిక్కిన బాటసారిని

రాగం ద్వేషం స్వార్థ మత్తు వ్యసనాలకి బానిసని

నైతికపతనమై అంబరమంటని నిస్సహాయుడిని

ఎత్తులకు కుయ్యెత్తులు వేయలేని అయోగ్యుడిని

మాటల బాణాలు సంధించలేని సమరయోధుడిని

మనసుండి కూడా ప్రేమించలేని భగ్నప్రేమికుడిని

ఇన్ని వైఫల్యాల వైకల్యమున్న నిండైన విగ్రహాన్ని

అయినా చెక్కుచెదరక సాగిపోతున్న ఒక సంచారిని

Saturday, May 17, 2014

ఆమెతో నేను

ఆమె నవ్వితే ముత్యాలు రాలునంట
నవ్వించి నడమంత్రపు సంపన్నుడినౌతా

ఆమె కంటి ఊసులు కవితాగానాలంట
కనులతో కనులు కలిపి ఊసులాడుతా

ఆమె  మోము అద్దానికి ప్రతిరూపమంట
మనసుని అలంకరించి ఎదురు నిలబడతా

ఆమె పెన్నిధి చలువ కలువ కౌగిళ్ళంట
మండేగుండెను ఆర్పమని దాసోహమౌతా

ఆమె నడక జాలువారే జలపాతమంట
కలసిరానికాలం ఆమె అడుగులో అడుగౌతా

ఆమెతో జీవితం అందమైన ఊహలసౌధమంట
నిజమంటే కనులు తెరచి కలగంటూ కైవసమౌతా

Saturday, April 5, 2014

ప్రేమసాక్షి

 
పొగత్రాగితే పోతుందా వేదనంటావు

సిగరెట్టు కాలిస్తే తీరేనా భాధంటావు

మదిలో రూపాన్ని కాలుస్తున్నాను

పొగతో నా పోకడే మార్చుకుంటాను

మందే మనుగడగా మలచబోతాను

గుండెండితే గొంతు దప్పిక తీర్చాను

మత్తులో నన్నని నిన్ను తలచాను

నిన్ను మరువని నా గుండెలవిసేను

మద్యం మరిపించలేదని మురిసేవు

నా ప్రేమకి ఇదే సాక్ష్యమని అంటావు