Monday, September 23, 2013

చూస్తున్నా



ప్రియురాలి పేరిట ఒక లేఖ రాశాను
ఆశలన్నింటినీ అందులో గుప్పిస్తూ
ఒంటరిగా ఉన్నప్పుడు చదవమంటూ
ఒక్కో పదంలో ప్రేమనంతా ఒలకబోస్తూ
లిఖించాను మదిలోనిమాట ఇదేనంటూ
గుండెలయకి తనపేరు మాత్రమే వినిపిస్తూ
సందేశం పంపాను రివ్వున వచ్చి వాలమంటూ
ప్రేమ కావ్యానికి పచ్చతోరణాలు తొడిగేలా ఆశిస్తూ
కనులుకాయిస్తున్నా మంచికాలం ముందుందంటూ

Saturday, August 17, 2013

నాతోడు


జీవితపు ఒడిలో సేదతీరుతూ కోరికంది
నేను ఎప్పుడు పరిపూర్ణత చెందుతానని
జీవితం నవ్వుతూ కోరిక తలనిమిరంది
పరిపూర్ణమైతే నీ రూపురేఖలుండవని*

జీవితానికి జీవించాలన్న ఆశ పెరిగింది
ఇతరులతో పోల్చుకోక మారిపోయానని
నన్ననుసరించే వారిని చూసి నవ్వింది
నాలోని కోరికలకి నేనే కళ్ళెం వేసానని*

జీవితపు మార్గాన్న ముళ్ళని ఏరమంది
స్నేహం శత్రుత్వము వేరొకరితో ఎందుకని
పరిపూర్ణతకి నాతోనన్నే జూదమాడమంది
ధైర్యాన్ని తోడంపింది గమ్యాన్ని చేరాలని*

Saturday, July 20, 2013

ఎలా జీవించను


నేను అక్కడ ఉంటే నన్ను ఇక్కడ వెతక్కు
చెల్లాచెదురై చిందిన అదృష్టాన్ని పోగుపెట్టకు
కొత్తప్రేమ కధను ఉల్లాసంగా ఎలా లిఖించను
వ్యధసిరాకలంతో హాస్యాన్ని ఏం పండించను
గుండె ఇక్కడుండి ఎక్కడో ఎగసిపడుతుంటే
శ్వాస ఆడుతూ జీవించి మరణించి నేనుంటే
జీవితాన్నే శిక్షగాఇచ్చి విధివ్రాతని వెక్కిరించకు
అందమైన జీవితముందని ఆశను కలిగించకు

Saturday, May 25, 2013

నాకేం


ఆమె నా ఆలోచన.......ఎవరి ఆలోచల్లో ఆమె ఉంటే నాకేం
ఆమె నా మొదటి చివరి ప్రేమ కావ్యం ఎవరు జపిస్తే నాకేం
ఆమె నా కంటి కనుపాప ఎందరి కళ్ళుపడితే మాత్రం నాకేం
ఆమె నా ప్రతిబింబాన్నిచూపే అద్దం ఎవరో మోహిస్తే నాకేం
ఆమె నా జీవితాశయ గమ్యం ఎందరికో ఆదర్శమైతే నాకేం
ఆమె కేవలం నాకుమాత్రమే సొంతం ఎవరు కావాలంటే నాకేం
ఆమె నా కొనఊపిరైతే చాలు.....నా జీవితం అంతమైనా నాకేం

Tuesday, May 14, 2013

ఏమిటో?

నీవు రావు నేనుండలేను
దారి మళ్ళిందో గమ్యమిదికాదో?

కళ్ళుమూసి ముఖం చిట్లిస్తావు
ప్రశ్నలంటే చాలా బెదురు నీకు!!!
వెలుగుని చూసి కళ్ళుమూస్తావు
చీకటి అంటే అతి ప్రియం నీకు!!!

ఆమె తలపులతో మరణించను
ఎవరిని తలుస్తూ తపిస్తున్నానో!!!
మరణించి కూడా నే జీవిస్తాను
అనుక్షణం ఆమె తలంపులలో!!!

Thursday, April 11, 2013

నీవడిగావు

జీవితం ఏమిటని నీవడిగావు?
నీవు లేనిది జీవితమే లేదని!
భాధేమని మరల ప్రశ్నించావు?
నాతో నీవులేని జీవితమే అదని!
ప్రేమంటే ఏమిటని నీవడగావు?
నాలో నీపై ఉన్నదంతా అదేనని!
దైవం అంటే ఏమిటని అడిగావు?
నేను కొలిచే ప్రేమదేవతవే నీవని!
ప్రేమించావెందుకని ప్రశ్నించావు?
నేనన్నాను అది నాక్కూడా తెలీదని!
ఎందుకింత తపన నేనంటే అన్నావు?
తెలిపా నేరం నాదికాదు నామనసుదని!