Saturday, December 22, 2012

ఎవరికేం....


కవికి తెలుసు అక్షరంలోని భావం
చదివే వారికేం....
మనసున్నోనికెరుక మానవత్వమేంటో
మృగానికేం....
తాగుబోతుకెరుక మత్తులో గమ్మత్తు
తాగించే వాడికేం....
కలసి విడిపోతే తెలుస్తుంది బంధమేంటో
ఒంటరివాడికేం....
సంపాదించేవాడికెరుక సొమ్ము విలువ
ఖర్చుచేసే వారికేం....
నమ్మేవారికెరుక నమ్మకమంటే ఏమిటో
మోసగాడికేం....
కఠినంగా శిక్షిస్తే తెలుస్తుంది న్యాయమేంటో
శిక్షపడని వాడికేం....

Wednesday, December 5, 2012

నీవుంటే

నిన్నుగాంచిన నామనసు అంది
రంగుల లోకం నా కళ్ళల్లోనే ఉంది
పరిమళమై గిలిగింత పెడుతున్నావు
ప్రేమగీతమై నన్ను అలరిస్తున్నావు
నిరీక్షణ ఫలించి కల నిజమైనట్లుంది
అంతలోనే నిజమో కాదో అనిపిస్తుంది
గుండెలో సవ్వడిలా ప్రతిధ్వనిస్తున్నావు
వెలుగు రేకై చీకటిలో కనబడుతున్నావు
నాతో ఉంటే నీవు ప్రేమకావ్యమే వస్తుంది
కాదంటే మరణించి మరల జీవించాలనుంది.