Saturday, July 28, 2012

5 పాయింట్స్ పెళ్ళిపై:)

 1.పెళ్ళిలు స్వర్గంలో జరిగితే భాజా బజంత్రీలు భువిపై మ్రోగడం ఎందుకో.

2.భార్యభర్తలు ఒకరు చెప్పే విషయము ఒకరు పొల్లుపోకుండా వినాలనుకుంటే నిద్రలో మాట్లాడండి.

3.పెళ్ళైన కొత్తలో భర్త చెపితే భార్యవింటుంది, రెండవ సంవత్సరం భార్యచెపితే భర్త వింటాడు, ఆపై వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే(అరుచుకుంటే) పక్కింటివాళ్ళు వింటారు.

4.భార్యభర్తలు ఒక్కరై జీవించాలని అనుకున్నప్పుడు ఎవరు ఎవరిలా మారాలో తేల్చుకోవడంతోనే విడివడతారేమో.

5.పెళ్ళికాక ముందు పరిపూర్ణత్వం లోటైతే, పెళ్ళైయ్యాక శూన్యంతో పూర్ణత్వం సిద్దిస్తుంది.

Saturday, July 21, 2012

ఉల్లాసంగా ఉత్సాహంగా...

జీవితం ఎంత ఉల్లాసంగా సాగిపోతూ వుంటుందో అప్పుడప్పుడూ బ్రేక్స్ పడేసరికి ఆ కుదుపుకు మనం నిలబడ్డామా లేదా అన్నదే కదా మనల్ని నిరూపించేది. ఏమైనా ఎన్నైనా తట్టుకొని నిలబడడం నేటి తరానికి అవసరం. రోజు వారీ పనుల వత్తిళ్ళ మధ్య కాస్తా విశ్రాంతి కోరుకుంటుంది మనసు. కానీ వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పగటికి రాత్రికి తేడా తెలీకుండా బ్రాయిలర్ కోళ్ళలా పెరుగుతాం కాన్సెప్ట్ స్కూళ్ళతో మొదలై కార్పొరేట్ కాలేజీలతో ముగిసిందనుకుంటే మరలా నొప్పి తెలీకుండా రక్తం పీల్చే జలగల్లాంటి మల్టీ నేషనల్ కంపెనీలలో గానుగెద్దుల్లా పడి. చివరగా ఆ శనివారమొచ్చిందంటే నాన్నో అమ్మో ఏదో ఒక వంకతో బయటకు పోతే ఏ పబ్ కో ఊరవతల షికార్లకో పోతారనుకొని మనకు ముందే ముందరి కాళ్ళకు బంధం వేసే అత్యవసర పనులు సృష్టించి వుంటారు. అయినా ఆ కల్చర్ కూడా జేబుకు, ఒంటికి చిల్లు పడేదే కదా అని సరిపెట్టుకున్నా మనసుకు హాయినిచ్చే సమయం కరువాయె. ఇన్ని వత్తిళ్ళ మధ్య యువత జీవితం మరో ఆలోచన లేకుండా గడిచిపోతోంది. సమకాలీన రాజకీయార్థిక సామాజిక తీరు తెన్నుల గురించి ఆలోచించే సమయం లేకుండా చేయడం కూడా ఓ కుట్రేనేమో అనిపిస్తుంది. మనలో దినపత్రికలు చదివే వాళ్ళెంతమంది? స్పోర్ట్స్ పేజీనో, సినిమా పేజీనో చూసి పక్కన పడేసే వాళ్ళమే కదా? యిదంతా అవసరమా అనికేత్ అంటే అవసరమే అంటాను ఫ్రెండ్స్.