Wednesday, September 27, 2017

సంకేతం

నలుపు తప్ప తెలియని నాకు
రంగు రంగుల కలలను అందించి 
నిదుర మరచిన కనురెప్పలకి
వేదనల బరువును జతచేసి
దిక్కుతోచక పైకి ఎగురలేక
రెక్కలు తృంచి వ్యధను పెంచి  
వసంతం నాసొంతం కాదని చెప్పి  
జీవితాన్ని సమాప్తం చేసుకోమని
పరోక్ష సంకేతాలు అందించిన
నా ప్రతీ అనుభవానికి సలాం!!!  

Saturday, September 2, 2017

ఇసుక పువ్వు

నేను ఒక ఇసుక పువ్వును 
అందినట్లే అంది చేజారిపోతాను
నాకు ఏ బాదరా బంధీలు లేవు
ఆకుల వంటి అనుబంధాలు లేవు
నిలకడ లేని అనిశ్చల రూపం  
గాలికి ఎగిరే ఎడారి జీవితం  
నిర్వికారంతో ఏ పరిమళం లేక 
విచ్చుకున్న ఇసుక పువ్వును.. 

Wednesday, June 29, 2016

ఒంటరి బాటసారి


                        రాతిరనక పగలనక విసిగి వేసారిపోక
ఒంటరినై ఆలోచనలతో సతమతమౌతూ
శాంతిసౌధ కుటీరాన్ని నిర్మించే ప్రయత్నంలో
పొడిబారిన కళ్ళలో కన్నీరు రాక పొగబారి
పగటి వెలుతురులో ఖాళీ కుండలు చూసి
రాత్రి చీకటిలో అగాధాన్ని చూసి జడిసి..
జీవించడానికి కారణం ఏం కనబడక
మరణించే మార్గంలేక బ్రతకడానికి వంక వెతుకుతూ
వయస్సుని మించిన నిడివి రోడ్డులో గమ్యం రాక
పరుగులు పెడుతూ ఆగక అపరిచితుల నడుమ
తెలిసిన వారికోసం వెతుకుతూ తిరుగుతూ..                         

Sunday, March 27, 2016

జ్ఞాపకాలు..


మన ప్రేమకి ముగింపు విచిత్రంగా ఉంది

నీ వాడిని ఎలాగో కాలేకపోయాను సరే

కనీసం ఇంకెవరికీ దక్కకుండా మిగిలాను 

మెడలో చేతికి ఎన్ని తాయెత్తులు కట్టుకున్నా 

లాభం లేకుండాపోయింది..

నీ జ్ఞాపకాలని అవి ఏమార్చలేక పోతున్నాయి

సంధ్యావేళ ఇంట్లో దీపాలన్నీ ఆర్పివేస్తాను... 

నీ జ్ఞాపకాలతో హృదయం మండుతున్నది చాలు!

Saturday, August 8, 2015

ప్రాణం తీసుకో!

ఎంత సులభంగా అనేసిందో కదా ఆమె

తీసుకుంది మనసే కానీ ప్రాణం కాదని

మనసులో నుండి తీసి మరచిపొమ్మని

ఆ మాటవిన్న నా మనసు నవ్వుకుంది

కొంతకాలమైనా తన మదిలో ఉన్నానని 

సంతోషంగా ఆమెను మరచిపోతానని...

ప్రాణమే తీసుకుని పుణ్యం కట్టుకోమని!!

Saturday, February 7, 2015

కావు


అబద్ధపు అభినందనల ఆసరాతో
కలల ప్రపంచంలో జీవించగలవు!!

నైపుణ్యం ఎంత ఉన్నా ఇసుకతో
అలల పై రహదారిని వేయలేవు!!

వ్యధనే వ్యక్తిగతమని ప్రియముతో
కన్నీటి దీపమెట్టి కాంతినీయలేవు!!

మనసు దహిస్తుంటే ఆలోచనలతో
నిస్తేజమైన శ్వాసతో ఈలవేయలేవు!!

అణగారిన అనామక కోర్కెల రెక్కలతో
ఆశయాల దుమ్ము దులిపి ఎగురలేవు!!

Friday, December 12, 2014

ఆగమ్యం

నిజాల నిలువుటద్దం నల్లబడిపోయింది

బుద్ధిహీనుల బుట్టంతా పూలతో నిండింది

అబధ్ధం నగ్నంగా బజారులో అమ్ముడైంది

నిజం చెప్పాలంటే నా తనువు వణుకుతుంది

సంసారాన్ని ఈదడంలో రెక్కలు ముక్కలైంది

రెక్కలు వచ్చిన పక్షి కొత్త గూడు వెతుక్కుంది

గమ్యం చేరలేని పయనం ఏడవలేక నవ్వింది!