Saturday, December 22, 2012

ఎవరికేం....


కవికి తెలుసు అక్షరంలోని భావం
చదివే వారికేం....
మనసున్నోనికెరుక మానవత్వమేంటో
మృగానికేం....
తాగుబోతుకెరుక మత్తులో గమ్మత్తు
తాగించే వాడికేం....
కలసి విడిపోతే తెలుస్తుంది బంధమేంటో
ఒంటరివాడికేం....
సంపాదించేవాడికెరుక సొమ్ము విలువ
ఖర్చుచేసే వారికేం....
నమ్మేవారికెరుక నమ్మకమంటే ఏమిటో
మోసగాడికేం....
కఠినంగా శిక్షిస్తే తెలుస్తుంది న్యాయమేంటో
శిక్షపడని వాడికేం....

Wednesday, December 5, 2012

నీవుంటే

నిన్నుగాంచిన నామనసు అంది
రంగుల లోకం నా కళ్ళల్లోనే ఉంది
పరిమళమై గిలిగింత పెడుతున్నావు
ప్రేమగీతమై నన్ను అలరిస్తున్నావు
నిరీక్షణ ఫలించి కల నిజమైనట్లుంది
అంతలోనే నిజమో కాదో అనిపిస్తుంది
గుండెలో సవ్వడిలా ప్రతిధ్వనిస్తున్నావు
వెలుగు రేకై చీకటిలో కనబడుతున్నావు
నాతో ఉంటే నీవు ప్రేమకావ్యమే వస్తుంది
కాదంటే మరణించి మరల జీవించాలనుంది.

Thursday, November 22, 2012

అస్లీ-నక్లీ

ఈ లోకంలో అవసరాన్నిబట్టి మారుస్తారు వారి వారి రూపం
అందుకే మాస్క్ వేసుకుని మనసుని దాచింది నా ముఖం

ఈ లోకానికి నచ్చేలా ఉండలేనంది నా సిసలైన రూపం
అందుకే అందరూ మెచ్చేలా ముసుగేసుకుంది నా ముఖం

ఈ లోకాన్ని ఆకట్టుకుంది రంగులు మారిన నకిలీ రూపం
అవసరానికి ముఖకవళికలు మార్చి నటించే నా ముఖం

ఈ లోకాన్ని వద్దని వెలివేసింది నాలోని నా అసలు రూపం
అనైతికంగా పతనం కాలేనని పారిపోయింది నా ముఖం

ఈ లోకంలో నేను నేనుగాలేనని నన్ను వీడింది నా రూపం
అస్తిత్వాన్ని వెతుకుతూ ఎటో వెళ్ళిపోయింది నా ముఖం

ఈ యాంత్రిక జీవనపయనంలో గుర్తులేదు నా అసలు రూపం
అలా అంతమై నన్ను అనామకుడ్ని చేసింది నా ముఖం

Friday, November 9, 2012

ప్రేమజంట గుసగుసలు

ఆమె:- మైనంలాంటి ప్రేమ మనదని కరిపోనీయకు ప్రియా....
అతడు:- అలా కరిపోయేది తరికిపోయేది ప్రేమేకాదు!
ఆమె:- నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తావా? నీవులేని లోకం నేనూహించలేను....
అతడు:- ప్రేమంటే నీవే నాకు నేర్పావు, నిన్ను ప్రేమించడం  తప్ప నాకింకేం తెలియదు!
ఆమె:- నీవులేని ఒంటరితనం అంటే నాకు భయం. నన్ను నీనుండి దూరం చేయకు...
అతడు:- నన్నూ ఈ విషయం భాధిస్తుంది అయినా ప్రేమతోపాటు ఏడబాటు కూడా వెన్నంటివస్తుంది!
ఆమె:- నేను లేకుండా నీవు బ్రతగలవా?
అతడు:- నేను ఇంతవరకూ ఈ విషయం ఆలోచించలేదు. ఆలోచించాలనుకున్న క్షణం నా ఊపిరాడకుంది!
ఆమె:- నీకు నాపై ఎందుకింత ప్రేమ?
అతడు:- నా కళ్ళతో చూడు అప్పుడుతెలుస్తుంది!
ఆమె:-నన్ను ఎందుకు అంతగొప్పగా అనుకుంటావు?
అతడు:- నీతో ఉన్నప్పుడు నేను ఎంత గొప్పవాడినో!
ఆమె:- నా ప్రేమను నీకు ఏభాషలో తెలుపను?
అతడు:- నీ చూపులో నాపై ప్రేమని, నీ మౌనంలో ప్రేమభాషని నేను గ్రహించాను!
ఆమె:- నీకిష్టమైన ఋతువేంటో చెప్పు?
అతడు:- నా హృదయపుటద్దంలో చూడు నీవే కనిపిస్తావు!
ఆమె:- నేను పరవసించేలా భలే మాట్లాడతావు...
అతడు:- పైన చెప్పినమాటలతో నిన్ను ఆకట్టుకోవాలనేది ఒక నెపం, జీవితం నీతో సాగిపోయి తరువాత మౌనంగా మాసిపోతే అంతే చాలు!

Saturday, November 3, 2012

అవసరం

నా శ్వాసకి తన ప్రేమే ప్రాణం
ప్రేమించడమే నాకొక శాపం..
నాలో దాగిన ఆమే దానికి కారణం!
దూరమైపోదు అలాగని దగ్గరగారాదు
ప్రతి క్షణం దగ్గరున్నట్లుంటుంది..
కాని అందనంత దూరాన్న ఎందుకనో ఉంది!
బహుశా నాతో ఆటలాడుకుంటుందో
లేక నేనంటే నమ్మకమే లేకుందో..
నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించానని
ఆమెతెలుసుకునే లోపు నా ఊపిరే ఆగిపోతుంది.

Tuesday, October 23, 2012

ఫ్యాషన్

ఫ్యాషన్ కి పరిభాష పాతని కొత్తగా చూపడమా? 
ఆధునీకతంటూ అల్లరిపాలు కావడం అవసరమా!
అమ్మతనాన్నిదాచి అమ్మాయిని అనిపించుకోవడమా!
యువతీయువకులు వయసుదాచే విశ్వప్రయత్నమా!
నేటి-నాటి తరాల ఆలోచనా వ్యత్యాసాల సంగ్రామమా!
భారతీయ సంస్కృతి పై జరుపబడే చర్చనీయాంశమా!

ఫ్యాషన్ కి  పర్యాయపదాలంటూ అర్ధాలు ఎన్నున్నా...
ఆలోచనలు ఫ్యాషనంటూ ఆధునీకరణ అవలంభించినా!
నరనరాల్లో దాగిన అమ్మతనమంత త్వరగా జీర్ణమగునా!
విద్య నేర్పిన జ్ఞానం వయసుని వక్రదారిలో నడిపించునా!
 
సౌకర్య సౌందర్యాన్నిచ్చే సాధనను కాదనదు తరమేదైనా!
పరులుమెచ్చే మన సంస్కృతిని పరులపాలుజేయ తగునా?

Thursday, October 11, 2012

ఈ అనుభవమేదో


తెలవారిందంటూ తెల్లనిమెరిసే చీరతో
అందాల సుగంధాలతో....వేడి వేడి కాఫీని
నవ్వుతూ అందించె గలగలమనె గాజులచేతితో
మగతన నా కళ్ళు మరల మత్తెక్కెను ఈ చర్యతో

ముసిముసి నవ్వుల కనుదోయలు,
చెంపలని ముద్దాడుతున్న ఆ ముంగురులు
ముద్దాడవేలంటూ ప్రశ్నించే వణికే ఆమెపెదవులు
వయ్యారి వాలుజడను హత్తుకున్న విరజాజులు
ఆమెను హత్తుకోను విరహమేలంటూ చేసెనెన్నో సైగలు

చేయందుకోబోయి మంచంపైనుండి పడ్డాను కెవ్వుకేకతో
పదిగంటలు కొట్టిన అలారం తెలిపింది.... నా నడ్డివిరిగిందని
కళ్ళు తెరచిచూడ ఒక కలగా మిగిలెను ఈ అనుభవమేదో:-)

Wednesday, September 26, 2012

కావాలా!

పిండివంటలకై పండగదాకా ఆగాలా
కలవాలనుకుంటే కారణం వెతకాలా
ప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలా
మనసు కోరిన నిన్ను నేను కాదనాలా!

ఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకు
ప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకు
నుదుటిరాతలో లేనంటూ దూరంచేయకు
ప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకు!

నా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలా
హృదయాకాశపందిరిని నీముందుపరచాలా
తనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలా
నిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!

Tuesday, September 11, 2012

చివరివరకు.

 వ్రాయాలనుకున్నంత మాత్రాన్న రాసేయగలనా
ఓనమాలు దిద్దుతూ గ్రంధాలగూర్చి చర్చించగలనా
మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనా
బ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనా
చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది
వెన్ను ఉదరము ఒకటై ఆకలితో అల్లాడే వాడిగురించి
కడుపునిండి కాలుచాపుకున్నవాడికి ఏమని వివరించేది
వేటలో వింటికి చిక్కిన హరిణి గోలచేసి గొంతెత్తి అరిచినా
వినిపించుకోని విల్లుకారుడు దాన్ని జాలితో విడిచిపెట్టేనా
జీవనపయనం ఒడిదుడుకులతో ఎటువైపు సాగిపోయినా
నిరాశచెందక గమ్యంకొరకై అంతంవరకూ ప్రయత్నించనా!

Sunday, August 26, 2012

అవిటివాడినైశుభోదయమంటూ మేల్కొల్పావు అప్పుడెప్పుడో నన్ను
నాటి నుండి నేటిదాకా నిదురపోలేక పోయాను ....
ఇదిమరి నా వెర్రితనమో లేక ప్రేమకున్న మాయరోగమో
నీవు చేసిన వెలితిని పూరించాలకున్నా జోడీనై మరొకరికి
నీహృది ఎంగిలి కూడంటూ మరోమనసు కాదంటోంది నన్ను
మనసునేకాదు నన్నునేను సముదాయించుకున్నాను...
ఇదిమరి నా దురదృష్టమో రాత రాసినవాడి చేతకానితనమో
నీ మౌనపుహోరు మాత్రమే వినిపిస్తుంది నా చెవిటితనానికి
నీ చెలిమితో మురిపించి సేద తీర్చావు ఒంటరినైన నన్ను
మరోలోకం చూపి మరలిరాక నన్ను ఒంటరిని చేసావు...
ఇదిమరి నేను జీవితంలో ఓడిపోవడమో లేక పైవాడి విజయమో
గమ్యం ఏమిటో తెలియని అవిటివాడినై మిగిలానిలా చివరికి!!!

Saturday, July 28, 2012

5 పాయింట్స్ పెళ్ళిపై:)

 1.పెళ్ళిలు స్వర్గంలో జరిగితే భాజా బజంత్రీలు భువిపై మ్రోగడం ఎందుకో.

2.భార్యభర్తలు ఒకరు చెప్పే విషయము ఒకరు పొల్లుపోకుండా వినాలనుకుంటే నిద్రలో మాట్లాడండి.

3.పెళ్ళైన కొత్తలో భర్త చెపితే భార్యవింటుంది, రెండవ సంవత్సరం భార్యచెపితే భర్త వింటాడు, ఆపై వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే(అరుచుకుంటే) పక్కింటివాళ్ళు వింటారు.

4.భార్యభర్తలు ఒక్కరై జీవించాలని అనుకున్నప్పుడు ఎవరు ఎవరిలా మారాలో తేల్చుకోవడంతోనే విడివడతారేమో.

5.పెళ్ళికాక ముందు పరిపూర్ణత్వం లోటైతే, పెళ్ళైయ్యాక శూన్యంతో పూర్ణత్వం సిద్దిస్తుంది.

Saturday, July 21, 2012

ఉల్లాసంగా ఉత్సాహంగా...

జీవితం ఎంత ఉల్లాసంగా సాగిపోతూ వుంటుందో అప్పుడప్పుడూ బ్రేక్స్ పడేసరికి ఆ కుదుపుకు మనం నిలబడ్డామా లేదా అన్నదే కదా మనల్ని నిరూపించేది. ఏమైనా ఎన్నైనా తట్టుకొని నిలబడడం నేటి తరానికి అవసరం. రోజు వారీ పనుల వత్తిళ్ళ మధ్య కాస్తా విశ్రాంతి కోరుకుంటుంది మనసు. కానీ వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పగటికి రాత్రికి తేడా తెలీకుండా బ్రాయిలర్ కోళ్ళలా పెరుగుతాం కాన్సెప్ట్ స్కూళ్ళతో మొదలై కార్పొరేట్ కాలేజీలతో ముగిసిందనుకుంటే మరలా నొప్పి తెలీకుండా రక్తం పీల్చే జలగల్లాంటి మల్టీ నేషనల్ కంపెనీలలో గానుగెద్దుల్లా పడి. చివరగా ఆ శనివారమొచ్చిందంటే నాన్నో అమ్మో ఏదో ఒక వంకతో బయటకు పోతే ఏ పబ్ కో ఊరవతల షికార్లకో పోతారనుకొని మనకు ముందే ముందరి కాళ్ళకు బంధం వేసే అత్యవసర పనులు సృష్టించి వుంటారు. అయినా ఆ కల్చర్ కూడా జేబుకు, ఒంటికి చిల్లు పడేదే కదా అని సరిపెట్టుకున్నా మనసుకు హాయినిచ్చే సమయం కరువాయె. ఇన్ని వత్తిళ్ళ మధ్య యువత జీవితం మరో ఆలోచన లేకుండా గడిచిపోతోంది. సమకాలీన రాజకీయార్థిక సామాజిక తీరు తెన్నుల గురించి ఆలోచించే సమయం లేకుండా చేయడం కూడా ఓ కుట్రేనేమో అనిపిస్తుంది. మనలో దినపత్రికలు చదివే వాళ్ళెంతమంది? స్పోర్ట్స్ పేజీనో, సినిమా పేజీనో చూసి పక్కన పడేసే వాళ్ళమే కదా? యిదంతా అవసరమా అనికేత్ అంటే అవసరమే అంటాను ఫ్రెండ్స్.

Wednesday, June 27, 2012

సాధించు..

నన్ను దరిచేరి....
శోధించి సాహసంతో గెలుపొందు
ప్రేమగా నన్ను కౌగిలించుకుని
నాలోని లోటుపాట్లను
సరిచేసుకుని అభిమానిస్తే....
కష్టం కూడా ఇష్టమై
నాలో మంచే కాని చెడు కనలేవు
సాధనలో తప్పులై నొప్పైనా
కొన్నాళ్ళకి ఆ అనుభవాలే నిన్ను
అందలాన్నెక్కిస్తాయి!

Saturday, June 16, 2012

ఓ!!! నాన్న

నా జన్మకు కారణమైన....ఓ!!! నాన్న

మీ భావాలతో నేను ఏకీభవించకపోవచ్చు

అవి మన మధ్య తరాల అంతరమైఉండొచ్చు

కూతురిలా అభిమానాన్ని తెలపలేకపోవచ్చు

కాని...

నన్ను ఎత్తుకుని ముద్దాడిన మీ చేతులు

నాలో మిమ్మల్ని చూసుకుని మురిసినవైనాలు

నా తప్పుల్ని సరిదిద్ది నాకు మార్గం చూపిన ప్రేమ

నా ఉన్నతికై మీరు పడిన శ్రమ....గుర్తున్నాయి నాన్నలోకం తీరు తెలిపిన.....ఓ!!! తండ్రీ

యువరక్తం నాలో రేపిన చంచలమైన చిచ్చు

అమ్మతో మీపై ఫిర్యాదులెన్నో చేసి ఉండొచ్చు

మిమ్మల్ని నొప్పించి మీకన్నా ఏపుగా ఎదగొచ్చు

కానీ...

నాతోపాటు మీరు సంబరంగా వేసిన కుప్పిగంతులు

నా మీసాలనుచూసి మెలితిరిగిన మీ గుబురుమీసాలు

నన్ను ఇంతటివాడ్నిగా మలచిన మీ సజలనయనాల్లో

దాగిన నాపై మీకున్న వాత్సల్యము....గుర్తున్నాయి తండ్రీఎంతటివాడినైనా...ఓ!!! పితా

అందరూ నన్ను మీకన్నా గొప్పవాడిననొచ్చు

రేపు నన్ను మించిన వాడికి నేను తండ్రినికావొచ్చు

స్వార్థమో, సమయభారమో మనిరువురిని దూరంచేయొచ్చు

కానీ...

మీ ఆలనలో పొందిన ఆప్యాయానురాగాలు

మీరు చూపిన అనుకూలమైన ఆదర్శమార్గాలు

నేను అవలంభించవలసిన నియమనిబంధనలు

మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ....గుర్తుంటాయి పితా!"నా ఉనికి కారణం నీవే, నా కధానాయకుడివి నీవే"
                                       ఇది మీకే అంకితం.....
"పితృదినోత్సవ శుభాకాంక్షలు"

Wednesday, May 30, 2012

ఎందుకో?

సూర్యకాంతికి విచ్చుకుని కమలం తెలుపుతుంది తనలోని ప్రేమను
అంతే  కాని
అది మధ్యాహ్నం వరకు వేచి ఉండదు...
చందమామను చూసి విప్పారే కలువం రాత్రంతా మేల్కొనిఉండదు.
మేఘాలతో బరువెక్కిన ఆకాశం వర్షిస్తుందే కానీ ధరణి పిలుపుకై వేచిఉండదు.
సాగరకెరటం అల అయి తీరంతో చేరి తిరిగి వెళ్ళకమానదు.
ఇలా....
ప్రకృతిలో లేని స్వార్థము, నిర్మొహమాటము కేవలము మనుషుల్లో మాత్రం ఎందుకో?
తన అనుకున్నవారు తమకే సొంతం కావాలని కోరుకోవడం ఎందుకో?
తమలోని భావావేశాలను చెప్పడానికి  స్త్రీ, పురుషులు
అంటూ నిర్మొహమాట తారతమ్యాలెందుకో?
సహజసిధ్ధమైన కార్యాలకి ఇన్ని కట్టుదిట్టాలెందుకో?

ప్రకృతితో పాటుగా సృష్టించబడిన మనలో
ఇన్ని నియమనిబంధనలతో కూడిన బంధాలెందుకో?

Wednesday, May 2, 2012

ఏమికాను?

ఆహారమైపోవ నే శిభిని కాను
కవచకుండలాలివ్వ కర్ణున్ని కాను
నేలనివ్వ నేను బలిచక్రవర్తిని కాను

నా మదిలో చోటివ్వడం తప్ప
ఆనందింపచేసే ప్రయత్నం తప్ప
స్నేహానికి ప్రాణం ఇవ్వడం తప్ప

ధీరుడిలా కండల్ని చూప లేను
మేటి హీరోనై మెప్పించనూ లేను
మాటలతో నేను మురిపించ లేను

పదాలని అటువిటు కూర్చడం తప్ప
చిరునవ్వునై విరబూయాలనే తప్ప
మీతో ఇలా పంచుకోవలనే ఆశ తప్ప

Thursday, April 26, 2012

మమ్మీ మారిందోచ్ :)
చూడండి......
ఆ అమాయకపు బాతుపిల్ల గుడ్డిగా నమ్మి తనకుతానుగా సమర్పించుకుని ఎదుటివారిలో కరుకుతనం,కోరిక రిగి తన దారిలోకి తెచ్చుకోవడం నాకు ఎంతో నచ్చిందండి, నచ్చితే ఊరుకుంటానా! మీతో పంచుకుంటాను కదండి. 
అందుకే ఇలా మీతో.....
చూసి కిమ్మనకుండా కూర్చుంటే  "కిక్" ఏముంటుంది చెప్పండి?
అందుకే కౌంట్ చేయండి....
ఆ బాతుపిల్ల ఎన్నిసార్లు మమ్మి(Mommy) అని అందోమరి??
కరెక్టో కాదో ఇంకొకరికి చూపించి సరిచూసుకోండి :)

Saturday, April 21, 2012

అనికేత్ అభివందనాలు...

చిన్నతనం నుండి చెట్టెక్కి దానిచుట్టూ తిరిగి ఆడుకుని, ఆకులుదాల్చి, పూలుపూసి నీడనిచ్చిన దాని ఒడిలో సేదతీరి, ఆ చెట్టుకి కాసిన పండ్లను తిని హాయిగా ఎదిగి జీవనం సాగించి కొన్నాళ్ళకి చెట్టు దరిచేరిన  ఆ బాలుడితో చెట్టు "కుమారా! ఎలా ఉన్నావు? రా నాతో కాసేపు ఆడుకో నా నీడలో సేడతీరు అన్నది. దానికి సమాధానంగా ఆ బాలుడు "నేను ఇప్పుడు చిన్న పిల్లవాడినేం కాను నీ చుట్టూ తిరిగి ఆడుకోడానికి నాకు బొమ్మలు కావాలి వాటికోసం డబ్బులు కావాలి అన్నాడు. దానికి చెట్టు కలవర పడి "అయ్యో! నా దగ్గర డబ్బులు లేవు కావాలంటే నా చెట్టు పండ్లమ్మి సొమ్ముచేసుకో" అని సలహా ఇచ్చింది. అది విని ఆ బాలుడు ఆనందంతో అలాగే చేసాడు కొత్తబొమ్మలతో ఆడుకుంటూ చాన్నాళ్ళ వరకు ఆ చెట్టువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీనికి ఆ చెట్టు ఎంతో విచారించింది.

కొన్నేళ్ళకి ఆ బాలుడు వ్యక్తిగా మారి ఆచెట్టు నీడలో నించుంటే అది "నాయనా! ఇప్పుడైనా నాతో ఆడుకో" అనంది. దానికి సమాధానంగా ఆ వ్యక్తి "నాకు ఇప్పుడు సమయంలేదు నీతో తీరిగ్గా ఆడుకోడానికి ముచ్చడించడానికి అయినా నేను నా కుటుంబానికి ఒక గూడుని అమర్చుకోవాలి సహాయం చేయగలవా" అని అడిగాడు. దానికి విచార వదనంతో ఆ చెట్టు "అవునా అలా అయితే నా పండ్లను కోసి, నన్ను నరికి నా కలపను అమ్మి సొమ్ము చేసుకో" అని అన్న సమాధానానికి సంబరపడి ఆ వ్యక్తి అలా చేసి ఆనందంలో ఆ చెట్టుని మరిచాడు.

చాలా ఏళ్ళకీ ఆ వ్యక్తి అలసి ఆ మోడుబారిన చెట్టు దరిచేరాడు.. అప్పుడు ఆ చెట్టు "నాయనా క్షమించు! నా దగ్గర పండ్లు లేవు నీకు ఇద్దామంటే, నీడనిద్దామంటే నేనే మోడుబారి ఉన్నాను, నీకేమీ సహాయం చేయ లేను" అంది. దానికి ఆ అతడు "మరేం పర్వాలేదు ఇప్పుడు పండ్లు కొరుక్కుతినే శక్తి సన్నగిల్లింది, అలాగని చెట్టెక్కి ఆడుకోనులేను, ప్రస్తుతం అలసిన నా శరీరము కాసేపు కూర్చోవాలని ఆశపడుతుంది అంతే అన్నాడు. అది విని చెట్టు విలవిలలాడి "రా నాయనా ఇలా వచ్చి నా మ్రానుపై కూర్చో" అంది.  అతడు ఆ మాటవిని మ్రానుపై కూర్చుని కన్నీళ్ళు కార్చాడు.

****చెట్టు లాంటి వాళ్ళే మన తలిదండ్రులు కూడా......చిన్నప్పుడు వారి నీడలో పెరిగి, వారితో ఆడి, వారి వలనే వృధ్ధిలోకి వచ్చి, వారినే మరచిపోతాం****
అందుకే.... ప్రేమిద్దాం, పలుకరిద్దాం ఎక్కడ ఉన్నా ఎలాఉన్నా మనకు జన్మనిచ్చిన వారిని.
(నా ఈ మొదటి పోస్టు వారికే......అభివందనాలతో)
సూచన:- జపనీస్ కధకు అనువాదం