Friday, December 12, 2014

ఆగమ్యం

నిజాల నిలువుటద్దం నల్లబడిపోయింది

బుద్ధిహీనుల బుట్టంతా పూలతో నిండింది

అబధ్ధం నగ్నంగా బజారులో అమ్ముడైంది

నిజం చెప్పాలంటే నా తనువు వణుకుతుంది

సంసారాన్ని ఈదడంలో రెక్కలు ముక్కలైంది

రెక్కలు వచ్చిన పక్షి కొత్త గూడు వెతుక్కుంది

గమ్యం చేరలేని పయనం ఏడవలేక నవ్వింది!

Thursday, October 16, 2014

లోకంలో

 ధ్వేషించే లోకంలో
శాంతి కుటీరమే కట్టబోయా...
జనం వెర్రివాడినని రాళ్ళు రువ్వారు!!
పరుగు పందెం వంటి జీవితపయనంలో
గెలిస్తే జనం మన వెనుకనే వస్తారు...
ఓడిపోతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు!!

అనాధ లోకంలో అలసిపోయాను
నన్ను నేను రుజువు చేసుకోవాలంటూ
పద్ధతులు గతితప్పాయి కాని ఉద్ధేశాలు కావు
విజేత సంతోషంగా ఉన్నా లేకపోయినా...
సంతోషంగా ఉన్నవాడు తప్పక విజేత అవుతాడు!!

Monday, September 8, 2014

మాయపొర

మాటలురానప్పుడు అమ్మ మాట్లడకపోయినా

అన్నీ తనే అర్థం చేసుకుని సమకూర్చేది...

ఇప్పుడు మాటలొచ్చిన మనం అమ్మ ఏమన్నా

ఊరుకో నీకేం అర్థంకాదని అంటున్నాం....

ఇది అమ్మ మాటలు నేర్పినందుకు పారితోషకమా!

లేక కంటికి కమ్మిన జ్ఞానపొర మాయాజాలమా?

మాయేనేమో....అందుకే అమ్మ ప్రేమలో జీవముంది
 

Thursday, July 31, 2014

ప్రశాంతం

ఆటుపోట్లకి జంకని జీవితాన్ని కావాలని కోరితే
ఆలోచనల అఘాధంలోకి తొంగి చూడబోకన్నది

సూర్యకిరణాల నుండి ఒక తంతిలాగి చుట్టబోతే
సంధ్యా సమయం దాటి కారుచీకటే కమ్మేసింది

గడచిన కాలం స్మృతుల్లో మాధుర్యం వెతగబోతే
అలజడి అలే మోముపై ముడతై అగుపించింది

పైపైన సాగరం ప్రశాంతంగా ఉందని సంబరపడితే
లోపలదాగిన తూఫాను అలై ఎగసి ముంచేసింది

ముందున్న సంబరమే మురిపించి నవ్వించబోతే
ముందరి కాళ్ళకడ్డై విధివక్రించి విరగబడి నవ్వింది

Tuesday, June 17, 2014

ఒక సంచారి

నేనెప్పుడూ ఓటమిని కౌగిలించుకున్న ఒంటరిని

కలల ఎరల వలల ఉచ్చులో చిక్కిన బాటసారిని

రాగం ద్వేషం స్వార్థ మత్తు వ్యసనాలకి బానిసని

నైతికపతనమై అంబరమంటని నిస్సహాయుడిని

ఎత్తులకు కుయ్యెత్తులు వేయలేని అయోగ్యుడిని

మాటల బాణాలు సంధించలేని సమరయోధుడిని

మనసుండి కూడా ప్రేమించలేని భగ్నప్రేమికుడిని

ఇన్ని వైఫల్యాల వైకల్యమున్న నిండైన విగ్రహాన్ని

అయినా చెక్కుచెదరక సాగిపోతున్న ఒక సంచారిని

Saturday, May 17, 2014

ఆమెతో నేను

ఆమె నవ్వితే ముత్యాలు రాలునంట
నవ్వించి నడమంత్రపు సంపన్నుడినౌతా

ఆమె కంటి ఊసులు కవితాగానాలంట
కనులతో కనులు కలిపి ఊసులాడుతా

ఆమె  మోము అద్దానికి ప్రతిరూపమంట
మనసుని అలంకరించి ఎదురు నిలబడతా

ఆమె పెన్నిధి చలువ కలువ కౌగిళ్ళంట
మండేగుండెను ఆర్పమని దాసోహమౌతా

ఆమె నడక జాలువారే జలపాతమంట
కలసిరానికాలం ఆమె అడుగులో అడుగౌతా

ఆమెతో జీవితం అందమైన ఊహలసౌధమంట
నిజమంటే కనులు తెరచి కలగంటూ కైవసమౌతా

Saturday, April 5, 2014

ప్రేమసాక్షి

 
పొగత్రాగితే పోతుందా వేదనంటావు

సిగరెట్టు కాలిస్తే తీరేనా భాధంటావు

మదిలో రూపాన్ని కాలుస్తున్నాను

పొగతో నా పోకడే మార్చుకుంటాను

మందే మనుగడగా మలచబోతాను

గుండెండితే గొంతు దప్పిక తీర్చాను

మత్తులో నన్నని నిన్ను తలచాను

నిన్ను మరువని నా గుండెలవిసేను

మద్యం మరిపించలేదని మురిసేవు

నా ప్రేమకి ఇదే సాక్ష్యమని అంటావు

Wednesday, February 19, 2014

ఇదే పరమార్ధమా?

మట్టితో బొమ్మను చేసి 

కలలతో అదృష్టాన్ని రాసి

నూలుపోగుతో బంధాన్ని వేసి

అందించే అనురాగానికి గిరి గీసి

బ్రతుకుకి స్వార్థపు రంగుని పూసి

సాగించే పయనం పేరే జీవించడమా

మనిషి పుట్టుకకు ఇదే పరమార్ధమా?