చిన్నతనం నుండి చెట్టెక్కి దానిచుట్టూ తిరిగి ఆడుకుని, ఆకులుదాల్చి, పూలుపూసి నీడనిచ్చిన దాని ఒడిలో సేదతీరి, ఆ చెట్టుకి కాసిన పండ్లను తిని హాయిగా ఎదిగి జీవనం సాగించి కొన్నాళ్ళకి చెట్టు దరిచేరిన ఆ బాలుడితో చెట్టు "కుమారా! ఎలా ఉన్నావు? రా నాతో కాసేపు ఆడుకో నా నీడలో సేడతీరు అన్నది. దానికి సమాధానంగా ఆ బాలుడు "నేను ఇప్పుడు చిన్న పిల్లవాడినేం కాను నీ చుట్టూ తిరిగి ఆడుకోడానికి నాకు బొమ్మలు కావాలి వాటికోసం డబ్బులు కావాలి అన్నాడు. దానికి చెట్టు కలవర పడి "అయ్యో! నా దగ్గర డబ్బులు లేవు కావాలంటే నా చెట్టు పండ్లమ్మి సొమ్ముచేసుకో" అని సలహా ఇచ్చింది. అది విని ఆ బాలుడు ఆనందంతో అలాగే చేసాడు కొత్తబొమ్మలతో ఆడుకుంటూ చాన్నాళ్ళ వరకు ఆ చెట్టువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీనికి ఆ చెట్టు ఎంతో విచారించింది.
కొన్నేళ్ళకి ఆ బాలుడు వ్యక్తిగా మారి ఆచెట్టు నీడలో నించుంటే అది "నాయనా! ఇప్పుడైనా నాతో ఆడుకో" అనంది. దానికి సమాధానంగా ఆ వ్యక్తి "నాకు ఇప్పుడు సమయంలేదు నీతో తీరిగ్గా ఆడుకోడానికి ముచ్చడించడానికి అయినా నేను నా కుటుంబానికి ఒక గూడుని అమర్చుకోవాలి సహాయం చేయగలవా" అని అడిగాడు. దానికి విచార వదనంతో ఆ చెట్టు "అవునా అలా అయితే నా పండ్లను కోసి, నన్ను నరికి నా కలపను అమ్మి సొమ్ము చేసుకో" అని అన్న సమాధానానికి సంబరపడి ఆ వ్యక్తి అలా చేసి ఆనందంలో ఆ చెట్టుని మరిచాడు.
చాలా ఏళ్ళకీ ఆ వ్యక్తి అలసి ఆ మోడుబారిన చెట్టు దరిచేరాడు.. అప్పుడు ఆ చెట్టు "నాయనా క్షమించు! నా దగ్గర పండ్లు లేవు నీకు ఇద్దామంటే, నీడనిద్దామంటే నేనే మోడుబారి ఉన్నాను, నీకేమీ సహాయం చేయ లేను" అంది. దానికి ఆ అతడు "మరేం పర్వాలేదు ఇప్పుడు పండ్లు కొరుక్కుతినే శక్తి సన్నగిల్లింది, అలాగని చెట్టెక్కి ఆడుకోనులేను, ప్రస్తుతం అలసిన నా శరీరము కాసేపు కూర్చోవాలని ఆశపడుతుంది అంతే అన్నాడు. అది విని చెట్టు విలవిలలాడి "రా నాయనా ఇలా వచ్చి నా మ్రానుపై కూర్చో" అంది. అతడు ఆ మాటవిని మ్రానుపై కూర్చుని కన్నీళ్ళు కార్చాడు.
****
చెట్టు లాంటి వాళ్ళే మన తలిదండ్రులు కూడా......చిన్నప్పుడు వారి నీడలో పెరిగి, వారితో ఆడి, వారి వలనే వృధ్ధిలోకి వచ్చి, వారినే మరచిపోతాం****
అందుకే....
ప్రేమిద్దాం, పలుకరిద్దాం ఎక్కడ ఉన్నా ఎలాఉన్నా మనకు జన్మనిచ్చిన వారిని.(నా ఈ మొదటి పోస్టు వారికే......అభివందనాలతో)
సూచన:- జపనీస్ కధకు అనువాదం