Wednesday, June 27, 2012

సాధించు..

నన్ను దరిచేరి....
శోధించి సాహసంతో గెలుపొందు
ప్రేమగా నన్ను కౌగిలించుకుని
నాలోని లోటుపాట్లను
సరిచేసుకుని అభిమానిస్తే....
కష్టం కూడా ఇష్టమై
నాలో మంచే కాని చెడు కనలేవు
సాధనలో తప్పులై నొప్పైనా
కొన్నాళ్ళకి ఆ అనుభవాలే నిన్ను
అందలాన్నెక్కిస్తాయి!

Saturday, June 16, 2012

ఓ!!! నాన్న

నా జన్మకు కారణమైన....ఓ!!! నాన్న

మీ భావాలతో నేను ఏకీభవించకపోవచ్చు

అవి మన మధ్య తరాల అంతరమైఉండొచ్చు

కూతురిలా అభిమానాన్ని తెలపలేకపోవచ్చు

కాని...

నన్ను ఎత్తుకుని ముద్దాడిన మీ చేతులు

నాలో మిమ్మల్ని చూసుకుని మురిసినవైనాలు

నా తప్పుల్ని సరిదిద్ది నాకు మార్గం చూపిన ప్రేమ

నా ఉన్నతికై మీరు పడిన శ్రమ....గుర్తున్నాయి నాన్న



లోకం తీరు తెలిపిన.....ఓ!!! తండ్రీ

యువరక్తం నాలో రేపిన చంచలమైన చిచ్చు

అమ్మతో మీపై ఫిర్యాదులెన్నో చేసి ఉండొచ్చు

మిమ్మల్ని నొప్పించి మీకన్నా ఏపుగా ఎదగొచ్చు

కానీ...

నాతోపాటు మీరు సంబరంగా వేసిన కుప్పిగంతులు

నా మీసాలనుచూసి మెలితిరిగిన మీ గుబురుమీసాలు

నన్ను ఇంతటివాడ్నిగా మలచిన మీ సజలనయనాల్లో

దాగిన నాపై మీకున్న వాత్సల్యము....గుర్తున్నాయి తండ్రీ



ఎంతటివాడినైనా...ఓ!!! పితా

అందరూ నన్ను మీకన్నా గొప్పవాడిననొచ్చు

రేపు నన్ను మించిన వాడికి నేను తండ్రినికావొచ్చు

స్వార్థమో, సమయభారమో మనిరువురిని దూరంచేయొచ్చు

కానీ...

మీ ఆలనలో పొందిన ఆప్యాయానురాగాలు

మీరు చూపిన అనుకూలమైన ఆదర్శమార్గాలు

నేను అవలంభించవలసిన నియమనిబంధనలు

మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ....గుర్తుంటాయి పితా!



"నా ఉనికి కారణం నీవే, నా కధానాయకుడివి నీవే"
                                       ఇది మీకే అంకితం.....
"పితృదినోత్సవ శుభాకాంక్షలు"