Wednesday, September 26, 2012

కావాలా!

పిండివంటలకై పండగదాకా ఆగాలా
కలవాలనుకుంటే కారణం వెతకాలా
ప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలా
మనసు కోరిన నిన్ను నేను కాదనాలా!

ఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకు
ప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకు
నుదుటిరాతలో లేనంటూ దూరంచేయకు
ప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకు!

నా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలా
హృదయాకాశపందిరిని నీముందుపరచాలా
తనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలా
నిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!

Tuesday, September 11, 2012

చివరివరకు.

 వ్రాయాలనుకున్నంత మాత్రాన్న రాసేయగలనా
ఓనమాలు దిద్దుతూ గ్రంధాలగూర్చి చర్చించగలనా
మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనా
బ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనా
చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది
వెన్ను ఉదరము ఒకటై ఆకలితో అల్లాడే వాడిగురించి
కడుపునిండి కాలుచాపుకున్నవాడికి ఏమని వివరించేది
వేటలో వింటికి చిక్కిన హరిణి గోలచేసి గొంతెత్తి అరిచినా
వినిపించుకోని విల్లుకారుడు దాన్ని జాలితో విడిచిపెట్టేనా
జీవనపయనం ఒడిదుడుకులతో ఎటువైపు సాగిపోయినా
నిరాశచెందక గమ్యంకొరకై అంతంవరకూ ప్రయత్నించనా!