ఈ లోకంలో అవసరాన్నిబట్టి మారుస్తారు వారి వారి రూపం
అందుకే మాస్క్ వేసుకుని మనసుని దాచింది నా ముఖం
ఈ లోకానికి నచ్చేలా ఉండలేనంది నా సిసలైన రూపం
అందుకే అందరూ మెచ్చేలా ముసుగేసుకుంది నా ముఖం
ఈ లోకాన్ని ఆకట్టుకుంది రంగులు మారిన నకిలీ రూపం
అవసరానికి ముఖకవళికలు మార్చి నటించే నా ముఖం
ఈ లోకాన్ని వద్దని వెలివేసింది నాలోని నా అసలు రూపం
అనైతికంగా పతనం కాలేనని పారిపోయింది నా ముఖం
ఈ లోకంలో నేను నేనుగాలేనని నన్ను వీడింది నా రూపం
అస్తిత్వాన్ని వెతుకుతూ ఎటో వెళ్ళిపోయింది నా ముఖం
ఈ యాంత్రిక జీవనపయనంలో గుర్తులేదు నా అసలు రూపం
అలా అంతమై నన్ను అనామకుడ్ని చేసింది నా ముఖం