Sunday, December 10, 2017

నిదురపో

సందెపొద్దు వాలి సందడంతా సోలిందీ 
అందరాని అంబరాన్న చందమామ తేలిందీ
జ్ఞాపకాలకు జోలపాడుతాను అనంటే వద్దంది  
నిదురపో అంటూ అలసిన శరీరం అంటుంది 
భాషరాని బాధలు గోలచేస్తూ నిదుర రానంది  
ఎంత అలసిపోయేయో నా ఆలోచనలు 
అలుపుతీరేలా కనుల నిదురపోదాం రమ్మంది 
కమ్మనికల కంటూ నిదురపొమ్మని జాబిలి అంది 

Wednesday, November 15, 2017

నీతో నేను

నీ అరవిరిసిన మోమును చూసా
అధరాలు కనులతో పాటు చెప్పిన 
అందమైన ఊసులు ఎన్నో విన్నా 
గంధర్వుడిని కాను నిన్ను స్తుతించ  
కవికోవిదుడను కాను నిన్ను వర్ణించ 
తత్వవేత్తను కాను నీతో తర్కించ 
ముసుగులో భావాలను దాచుకోలేను 
కోర్కెల్ని ఎదలో బంధించి మోయలేను   
మంత్రం వేసినట్లు నీ వైయనం తిలకిస్తాను 
ఏమైనా జరగనీ అంటూ ఊహల్లో విహరిస్తాను!

Wednesday, September 27, 2017

సంకేతం

నలుపు తప్ప తెలియని నాకు
రంగు రంగుల కలలను అందించి 
నిదుర మరచిన కనురెప్పలకి
వేదనల బరువును జతచేసి
దిక్కుతోచక పైకి ఎగురలేక
రెక్కలు తృంచి వ్యధను పెంచి  
వసంతం నాసొంతం కాదని చెప్పి  
జీవితాన్ని సమాప్తం చేసుకోమని
పరోక్ష సంకేతాలు అందించిన
నా ప్రతీ అనుభవానికి సలాం!!!  

Saturday, September 2, 2017

ఇసుక పువ్వు

నేను ఒక ఇసుక పువ్వును 
అందినట్లే అంది చేజారిపోతాను
నాకు ఏ బాదరా బంధీలు లేవు
ఆకుల వంటి అనుబంధాలు లేవు
నిలకడ లేని అనిశ్చల రూపం  
గాలికి ఎగిరే ఎడారి జీవితం  
నిర్వికారంతో ఏ పరిమళం లేక 
విచ్చుకున్న ఇసుక పువ్వును..