Thursday, November 22, 2012

అస్లీ-నక్లీ

ఈ లోకంలో అవసరాన్నిబట్టి మారుస్తారు వారి వారి రూపం
అందుకే మాస్క్ వేసుకుని మనసుని దాచింది నా ముఖం

ఈ లోకానికి నచ్చేలా ఉండలేనంది నా సిసలైన రూపం
అందుకే అందరూ మెచ్చేలా ముసుగేసుకుంది నా ముఖం

ఈ లోకాన్ని ఆకట్టుకుంది రంగులు మారిన నకిలీ రూపం
అవసరానికి ముఖకవళికలు మార్చి నటించే నా ముఖం

ఈ లోకాన్ని వద్దని వెలివేసింది నాలోని నా అసలు రూపం
అనైతికంగా పతనం కాలేనని పారిపోయింది నా ముఖం

ఈ లోకంలో నేను నేనుగాలేనని నన్ను వీడింది నా రూపం
అస్తిత్వాన్ని వెతుకుతూ ఎటో వెళ్ళిపోయింది నా ముఖం

ఈ యాంత్రిక జీవనపయనంలో గుర్తులేదు నా అసలు రూపం
అలా అంతమై నన్ను అనామకుడ్ని చేసింది నా ముఖం

Friday, November 9, 2012

ప్రేమజంట గుసగుసలు

ఆమె:- మైనంలాంటి ప్రేమ మనదని కరిపోనీయకు ప్రియా....
అతడు:- అలా కరిపోయేది తరికిపోయేది ప్రేమేకాదు!
ఆమె:- నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తావా? నీవులేని లోకం నేనూహించలేను....
అతడు:- ప్రేమంటే నీవే నాకు నేర్పావు, నిన్ను ప్రేమించడం  తప్ప నాకింకేం తెలియదు!
ఆమె:- నీవులేని ఒంటరితనం అంటే నాకు భయం. నన్ను నీనుండి దూరం చేయకు...
అతడు:- నన్నూ ఈ విషయం భాధిస్తుంది అయినా ప్రేమతోపాటు ఏడబాటు కూడా వెన్నంటివస్తుంది!
ఆమె:- నేను లేకుండా నీవు బ్రతగలవా?
అతడు:- నేను ఇంతవరకూ ఈ విషయం ఆలోచించలేదు. ఆలోచించాలనుకున్న క్షణం నా ఊపిరాడకుంది!
ఆమె:- నీకు నాపై ఎందుకింత ప్రేమ?
అతడు:- నా కళ్ళతో చూడు అప్పుడుతెలుస్తుంది!
ఆమె:-నన్ను ఎందుకు అంతగొప్పగా అనుకుంటావు?
అతడు:- నీతో ఉన్నప్పుడు నేను ఎంత గొప్పవాడినో!
ఆమె:- నా ప్రేమను నీకు ఏభాషలో తెలుపను?
అతడు:- నీ చూపులో నాపై ప్రేమని, నీ మౌనంలో ప్రేమభాషని నేను గ్రహించాను!
ఆమె:- నీకిష్టమైన ఋతువేంటో చెప్పు?
అతడు:- నా హృదయపుటద్దంలో చూడు నీవే కనిపిస్తావు!
ఆమె:- నేను పరవసించేలా భలే మాట్లాడతావు...
అతడు:- పైన చెప్పినమాటలతో నిన్ను ఆకట్టుకోవాలనేది ఒక నెపం, జీవితం నీతో సాగిపోయి తరువాత మౌనంగా మాసిపోతే అంతే చాలు!

Saturday, November 3, 2012

అవసరం

నా శ్వాసకి తన ప్రేమే ప్రాణం
ప్రేమించడమే నాకొక శాపం..
నాలో దాగిన ఆమే దానికి కారణం!
దూరమైపోదు అలాగని దగ్గరగారాదు
ప్రతి క్షణం దగ్గరున్నట్లుంటుంది..
కాని అందనంత దూరాన్న ఎందుకనో ఉంది!
బహుశా నాతో ఆటలాడుకుంటుందో
లేక నేనంటే నమ్మకమే లేకుందో..
నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించానని
ఆమెతెలుసుకునే లోపు నా ఊపిరే ఆగిపోతుంది.

Tuesday, October 23, 2012

ఫ్యాషన్

ఫ్యాషన్ కి పరిభాష పాతని కొత్తగా చూపడమా? 
ఆధునీకతంటూ అల్లరిపాలు కావడం అవసరమా!
అమ్మతనాన్నిదాచి అమ్మాయిని అనిపించుకోవడమా!
యువతీయువకులు వయసుదాచే విశ్వప్రయత్నమా!
నేటి-నాటి తరాల ఆలోచనా వ్యత్యాసాల సంగ్రామమా!
భారతీయ సంస్కృతి పై జరుపబడే చర్చనీయాంశమా!

ఫ్యాషన్ కి  పర్యాయపదాలంటూ అర్ధాలు ఎన్నున్నా...
ఆలోచనలు ఫ్యాషనంటూ ఆధునీకరణ అవలంభించినా!
నరనరాల్లో దాగిన అమ్మతనమంత త్వరగా జీర్ణమగునా!
విద్య నేర్పిన జ్ఞానం వయసుని వక్రదారిలో నడిపించునా!
 
సౌకర్య సౌందర్యాన్నిచ్చే సాధనను కాదనదు తరమేదైనా!
పరులుమెచ్చే మన సంస్కృతిని పరులపాలుజేయ తగునా?

Thursday, October 11, 2012

ఈ అనుభవమేదో


తెలవారిందంటూ తెల్లనిమెరిసే చీరతో
అందాల సుగంధాలతో....వేడి వేడి కాఫీని
నవ్వుతూ అందించె గలగలమనె గాజులచేతితో
మగతన నా కళ్ళు మరల మత్తెక్కెను ఈ చర్యతో

ముసిముసి నవ్వుల కనుదోయలు,
చెంపలని ముద్దాడుతున్న ఆ ముంగురులు
ముద్దాడవేలంటూ ప్రశ్నించే వణికే ఆమెపెదవులు
వయ్యారి వాలుజడను హత్తుకున్న విరజాజులు
ఆమెను హత్తుకోను విరహమేలంటూ చేసెనెన్నో సైగలు

చేయందుకోబోయి మంచంపైనుండి పడ్డాను కెవ్వుకేకతో
పదిగంటలు కొట్టిన అలారం తెలిపింది.... నా నడ్డివిరిగిందని
కళ్ళు తెరచిచూడ ఒక కలగా మిగిలెను ఈ అనుభవమేదో:-)

Wednesday, September 26, 2012

కావాలా!

పిండివంటలకై పండగదాకా ఆగాలా
కలవాలనుకుంటే కారణం వెతకాలా
ప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలా
మనసు కోరిన నిన్ను నేను కాదనాలా!

ఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకు
ప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకు
నుదుటిరాతలో లేనంటూ దూరంచేయకు
ప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకు!

నా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలా
హృదయాకాశపందిరిని నీముందుపరచాలా
తనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలా
నిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!

Tuesday, September 11, 2012

చివరివరకు.

 వ్రాయాలనుకున్నంత మాత్రాన్న రాసేయగలనా
ఓనమాలు దిద్దుతూ గ్రంధాలగూర్చి చర్చించగలనా
మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనా
బ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనా
చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది
వెన్ను ఉదరము ఒకటై ఆకలితో అల్లాడే వాడిగురించి
కడుపునిండి కాలుచాపుకున్నవాడికి ఏమని వివరించేది
వేటలో వింటికి చిక్కిన హరిణి గోలచేసి గొంతెత్తి అరిచినా
వినిపించుకోని విల్లుకారుడు దాన్ని జాలితో విడిచిపెట్టేనా
జీవనపయనం ఒడిదుడుకులతో ఎటువైపు సాగిపోయినా
నిరాశచెందక గమ్యంకొరకై అంతంవరకూ ప్రయత్నించనా!