Wednesday, September 26, 2012

కావాలా!

పిండివంటలకై పండగదాకా ఆగాలా
కలవాలనుకుంటే కారణం వెతకాలా
ప్రేమెందుకని పలుమార్లు నన్నడగాలా
మనసు కోరిన నిన్ను నేను కాదనాలా!

ఆశనిరాశలతో దాగుడుమూతలు ఆడకు
ప్రేమించలేనని నా దురదృష్టాన్ని పెంచకు
నుదుటిరాతలో లేనంటూ దూరంచేయకు
ప్రేమ బిచ్చగాడినని ఒంటరిగా వదిలేయకు!

నా శ్వాసే నీవనడానికి నిదర్శనం కావాలా
హృదయాకాశపందిరిని నీముందుపరచాలా
తనువుని పల్లకిజేసి జగమంత ఊరేగించాలా
నిన్ను పొందాలంటే నన్నునేను కోల్పోవాలా!

Tuesday, September 11, 2012

చివరివరకు.

 వ్రాయాలనుకున్నంత మాత్రాన్న రాసేయగలనా
ఓనమాలు దిద్దుతూ గ్రంధాలగూర్చి చర్చించగలనా
మదిలోన ఆశలెన్నో ఉదయించినా అవన్నీ ఫలించేనా
బ్రతికే ప్రయత్నంలో భాషరాని భావాలని అణిచేయనా
చీకటిన బంధించి ఒంటరి మనసుని భావమేమడిగేది
చమురులేని దీపాన్ని వెలుగులు విరజిమ్మనేలకోరేది
వెన్ను ఉదరము ఒకటై ఆకలితో అల్లాడే వాడిగురించి
కడుపునిండి కాలుచాపుకున్నవాడికి ఏమని వివరించేది
వేటలో వింటికి చిక్కిన హరిణి గోలచేసి గొంతెత్తి అరిచినా
వినిపించుకోని విల్లుకారుడు దాన్ని జాలితో విడిచిపెట్టేనా
జీవనపయనం ఒడిదుడుకులతో ఎటువైపు సాగిపోయినా
నిరాశచెందక గమ్యంకొరకై అంతంవరకూ ప్రయత్నించనా!

Sunday, August 26, 2012

అవిటివాడినై



శుభోదయమంటూ మేల్కొల్పావు అప్పుడెప్పుడో నన్ను
నాటి నుండి నేటిదాకా నిదురపోలేక పోయాను ....
ఇదిమరి నా వెర్రితనమో లేక ప్రేమకున్న మాయరోగమో
నీవు చేసిన వెలితిని పూరించాలకున్నా జోడీనై మరొకరికి
నీహృది ఎంగిలి కూడంటూ మరోమనసు కాదంటోంది నన్ను
మనసునేకాదు నన్నునేను సముదాయించుకున్నాను...
ఇదిమరి నా దురదృష్టమో రాత రాసినవాడి చేతకానితనమో
నీ మౌనపుహోరు మాత్రమే వినిపిస్తుంది నా చెవిటితనానికి
నీ చెలిమితో మురిపించి సేద తీర్చావు ఒంటరినైన నన్ను
మరోలోకం చూపి మరలిరాక నన్ను ఒంటరిని చేసావు...
ఇదిమరి నేను జీవితంలో ఓడిపోవడమో లేక పైవాడి విజయమో
గమ్యం ఏమిటో తెలియని అవిటివాడినై మిగిలానిలా చివరికి!!!

Saturday, July 28, 2012

5 పాయింట్స్ పెళ్ళిపై:)

 1.పెళ్ళిలు స్వర్గంలో జరిగితే భాజా బజంత్రీలు భువిపై మ్రోగడం ఎందుకో.

2.భార్యభర్తలు ఒకరు చెప్పే విషయము ఒకరు పొల్లుపోకుండా వినాలనుకుంటే నిద్రలో మాట్లాడండి.

3.పెళ్ళైన కొత్తలో భర్త చెపితే భార్యవింటుంది, రెండవ సంవత్సరం భార్యచెపితే భర్త వింటాడు, ఆపై వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే(అరుచుకుంటే) పక్కింటివాళ్ళు వింటారు.

4.భార్యభర్తలు ఒక్కరై జీవించాలని అనుకున్నప్పుడు ఎవరు ఎవరిలా మారాలో తేల్చుకోవడంతోనే విడివడతారేమో.

5.పెళ్ళికాక ముందు పరిపూర్ణత్వం లోటైతే, పెళ్ళైయ్యాక శూన్యంతో పూర్ణత్వం సిద్దిస్తుంది.

Saturday, July 21, 2012

ఉల్లాసంగా ఉత్సాహంగా...

జీవితం ఎంత ఉల్లాసంగా సాగిపోతూ వుంటుందో అప్పుడప్పుడూ బ్రేక్స్ పడేసరికి ఆ కుదుపుకు మనం నిలబడ్డామా లేదా అన్నదే కదా మనల్ని నిరూపించేది. ఏమైనా ఎన్నైనా తట్టుకొని నిలబడడం నేటి తరానికి అవసరం. రోజు వారీ పనుల వత్తిళ్ళ మధ్య కాస్తా విశ్రాంతి కోరుకుంటుంది మనసు. కానీ వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పగటికి రాత్రికి తేడా తెలీకుండా బ్రాయిలర్ కోళ్ళలా పెరుగుతాం కాన్సెప్ట్ స్కూళ్ళతో మొదలై కార్పొరేట్ కాలేజీలతో ముగిసిందనుకుంటే మరలా నొప్పి తెలీకుండా రక్తం పీల్చే జలగల్లాంటి మల్టీ నేషనల్ కంపెనీలలో గానుగెద్దుల్లా పడి. చివరగా ఆ శనివారమొచ్చిందంటే నాన్నో అమ్మో ఏదో ఒక వంకతో బయటకు పోతే ఏ పబ్ కో ఊరవతల షికార్లకో పోతారనుకొని మనకు ముందే ముందరి కాళ్ళకు బంధం వేసే అత్యవసర పనులు సృష్టించి వుంటారు. అయినా ఆ కల్చర్ కూడా జేబుకు, ఒంటికి చిల్లు పడేదే కదా అని సరిపెట్టుకున్నా మనసుకు హాయినిచ్చే సమయం కరువాయె. ఇన్ని వత్తిళ్ళ మధ్య యువత జీవితం మరో ఆలోచన లేకుండా గడిచిపోతోంది. సమకాలీన రాజకీయార్థిక సామాజిక తీరు తెన్నుల గురించి ఆలోచించే సమయం లేకుండా చేయడం కూడా ఓ కుట్రేనేమో అనిపిస్తుంది. మనలో దినపత్రికలు చదివే వాళ్ళెంతమంది? స్పోర్ట్స్ పేజీనో, సినిమా పేజీనో చూసి పక్కన పడేసే వాళ్ళమే కదా? యిదంతా అవసరమా అనికేత్ అంటే అవసరమే అంటాను ఫ్రెండ్స్.

Wednesday, June 27, 2012

సాధించు..

నన్ను దరిచేరి....
శోధించి సాహసంతో గెలుపొందు
ప్రేమగా నన్ను కౌగిలించుకుని
నాలోని లోటుపాట్లను
సరిచేసుకుని అభిమానిస్తే....
కష్టం కూడా ఇష్టమై
నాలో మంచే కాని చెడు కనలేవు
సాధనలో తప్పులై నొప్పైనా
కొన్నాళ్ళకి ఆ అనుభవాలే నిన్ను
అందలాన్నెక్కిస్తాయి!

Saturday, June 16, 2012

ఓ!!! నాన్న

నా జన్మకు కారణమైన....ఓ!!! నాన్న

మీ భావాలతో నేను ఏకీభవించకపోవచ్చు

అవి మన మధ్య తరాల అంతరమైఉండొచ్చు

కూతురిలా అభిమానాన్ని తెలపలేకపోవచ్చు

కాని...

నన్ను ఎత్తుకుని ముద్దాడిన మీ చేతులు

నాలో మిమ్మల్ని చూసుకుని మురిసినవైనాలు

నా తప్పుల్ని సరిదిద్ది నాకు మార్గం చూపిన ప్రేమ

నా ఉన్నతికై మీరు పడిన శ్రమ....గుర్తున్నాయి నాన్న



లోకం తీరు తెలిపిన.....ఓ!!! తండ్రీ

యువరక్తం నాలో రేపిన చంచలమైన చిచ్చు

అమ్మతో మీపై ఫిర్యాదులెన్నో చేసి ఉండొచ్చు

మిమ్మల్ని నొప్పించి మీకన్నా ఏపుగా ఎదగొచ్చు

కానీ...

నాతోపాటు మీరు సంబరంగా వేసిన కుప్పిగంతులు

నా మీసాలనుచూసి మెలితిరిగిన మీ గుబురుమీసాలు

నన్ను ఇంతటివాడ్నిగా మలచిన మీ సజలనయనాల్లో

దాగిన నాపై మీకున్న వాత్సల్యము....గుర్తున్నాయి తండ్రీ



ఎంతటివాడినైనా...ఓ!!! పితా

అందరూ నన్ను మీకన్నా గొప్పవాడిననొచ్చు

రేపు నన్ను మించిన వాడికి నేను తండ్రినికావొచ్చు

స్వార్థమో, సమయభారమో మనిరువురిని దూరంచేయొచ్చు

కానీ...

మీ ఆలనలో పొందిన ఆప్యాయానురాగాలు

మీరు చూపిన అనుకూలమైన ఆదర్శమార్గాలు

నేను అవలంభించవలసిన నియమనిబంధనలు

మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ....గుర్తుంటాయి పితా!



"నా ఉనికి కారణం నీవే, నా కధానాయకుడివి నీవే"
                                       ఇది మీకే అంకితం.....
"పితృదినోత్సవ శుభాకాంక్షలు"